History of iBAM

 "92: వా.వా.వంగూరి విశేషమ్... ఐ-భాగవత ఆణిముత్యాలు …..


చాలా ముఖ్యమైన పెద్ద పోస్ట్...ఓపిగ్గా చదవండి

నాకు హ్యూస్టన్ లో ఉన్న అత్యంత ఆప్తుడైన పుచ్చా మల్లిక్ అనే పెద్ద మనిషికి రోజూ స్నానం చేసే ‘దురలవాటు’ ఉంది.  అదొక్కటే అయితే ఫరవాలేదు.  సరిగ్గా ఆ సమయం లోనే అతనికి గొప్ప, గొప్ప ఆలోచనలు రావడం కూడా తోడవడమే కాకుండా అలా ఐడియాలు రాగానే నన్ను పిలిచి సలహా అడగడం, నేను చెప్పినది విని, తనకి కావలిసినట్టు చేసేసుకోవడం అసలుసిసలు అలవాటు.  ఆ పరంపరలో పదేళ్ళ క్రితం ఓ రోజు వళ్ళు తుడుచుకుంటూనే నన్ను కేకేసి “ఇలా జలకాలు ఆడుతున్నప్పుడు పోతన గారి పద్యాలు వినడం ఎలా?  అసలు రోజుకి 24 గంటలూ అవి వినగలిగే రేడియో, యూ ట్యూబ్ లాంటివి ఏమైనా ఉన్నాయా?” అని అడిగాడు.  మనకి ఆ డిపార్ట్ మెంట్లలో ఎక్కువ అనుభవం లేదు. అంతటి తో ఆగిపోతే అసలు కథే లేదు.

ఆ తరవాత అసలేం జరిగిందంటే....

2012 సంవత్సరం లో ఒక రోజు మల్లిక్ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం లో భాగవత ప్రాశస్త్యం, అది రోజుకి ఒక పద్యం అయినా వింటే సాధారణ మానవులకి కలిగే జ్ఞానం, జీవిత పురోగతి గురించి విన్నాడు.  ఆ నెల 19న బాలమురళీ కృష్ణ గోపరాజు మా 'హ్యూస్టన్ సాహితీ లోకం' గూగుల్ గుంపులో పోతన గారి “రాజట ధర్మజుండు” పద్యం పంపించి సాహిత్యం, భక్తి సాంప్రదాయాల మీద చర్చ లేవనెత్తడంతో మళ్ళీ స్నానం చేస్తున్నప్పుడు మల్లిక్ మస్తిష్కం లో ఒక ఆలోచన రావడం, అది నాతో పంచుకోవడం, తర్జన భర్జనలు పడడం, అనేక మంది మిత్రులతో సంప్రదించడం అయ్యాక ఆ ఆలోచనకి ఒక కార్యరూపం వచ్చింది.

అదేమిటంటే....కేవలం అత్యాధునిక సాంకేతిక పరమైన ఐ ఫోన్లు, ఏండ్రాయిడ్ ఫోన్లు, ఐ పాడ్, టాబ్లెట్, లాప్ టాప్ లాంటి మొబైల్ పరికరాలతో పరుగులు తీస్తున్న ఈ తరానికి అలాంటి అన్ని పరికరాలలోనూ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని. కారులో, విమానాలలో, ఆఫీసులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ..స్నానాల గదితో సహా... వినడానికి శ్రావ్యంగా ఉండేలా పోతన భాగవత పద్యాలతో ఒక App తయారు చేస్తే ఎలా ఉంటుందీ అనేదే ఆ అలోచన.

చిన్న పిల్లల నుంచి, యువతీ యువకులు, పెద్దవారు ..ఇలా ఏ తరం వారు అయినా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పోతన గారి పద్యాలు వినడానికి అటువంటి ప్రయత్నం జరగ లేదు అని మల్లిక్ నిర్ధారించుకుని రంగం లోకి దిగాడు.  దానికి ముందుగా కావలిసినది ఏయే పద్యాలు, ఎవరు ఎంపిక చేస్తారు, ఎవరు శ్రావ్యంగా పాడగలరు వగైరా ప్రశ్నలు ముందుకు వచ్చాయి.  సంగీతం సమకూర్చడానికీ, శ్రావ్యంగా పాడడానికీ నాకు తట్టిన వాడు, ఆత్మీయుడు, ..”పాడుతా తీయగా” పార్ధు గా పేరు పొందిన నేమాని పార్ధ సారధి.  అదే సమయం లో హ్యూస్టన్ లో ఉన్న కవి జొన్నవిత్తుల గారితో సంప్రదించగా ఆయనా పార్ధూ పేరే సూచించారు.

వెనువెంటనే మల్లిక్ స్థానిక మిత్రులు, అప్పుడు యెమెన్ దేశం లో ఉండే బాలాంత్రపు వెంకట రమణ (నా బాల్య మిత్రుడు, తమ్ముడూ అని పిలిచే వాడిని) సహాయంతో కొన్ని పద్యాలు ఎంపిక చేసుకుని, బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన ఎంపిక చేసిన పద్యాలకి “ఆణి ముత్యాలు” అని నామ కరణం చేసి, ఒక ప్రాధమిక ప్రణాళిక రూపొందించుకుని మిత్రులతో ఒక కార్యాచరణ, ఆర్ధిక అవసరాల మీద ఒక సమావేశం పెట్టాడు.

ఆగస్ట్, 2013 లో  జరిగిన ఆ సమావేశం లో అప్పటికప్పుడు పది వేల డాలర్లు విరాళం ఇచ్చి భాగవతుల ఆనంద మోహన్ అనే ఆత్మీయుడు మల్లిక్ ఆశయాలకి ప్రాణ ప్రతిష్ట చేశాడు.

వెనువెంటనే హైదరాబాద్ లో ఉన్న నేమాని పార్ధూని సంప్రదించగానే అతను అంగీకరించాడు.  ఆ ఆణి ముత్యాలకి “భాగవత గణనాధ్యాయి” వూలపల్లి సాంబశివరావు గారు ప్రతి పదార్ధాలు సమకూర్చారు.  ఆయా పద్యాల తాత్పర్యం వ్రాయడానికి ప్రాచార్య శలాక రఘునాధ శర్మ గారిని పార్థూ పరిచయం చేశాడు.  పోతన భాగవతం లో ఉన్న మొత్తం 7012 పద్యాలలో 324 పద్యాలు శలాక వారు ఎంపిక ఖరారు చేసి, అత్యద్భుతమైన, సరళమైన శైలిలో అన్నింటికీ సందర్భంతో సహా సందర్బమూ, తాత్పర్యం రచించారు.
వాటికి పార్ధూ ప్రతీ పద్యానికీ ఎంతో శ్రావ్యమైన సంగీతం సమకూర్చి, తను ప్రధాన గాయకుడి గా, నిత్య సంతోషిణి, గోపికా పూర్ణిమ, శ్రీకృష్ణ, శ్రీనిధి, హరిణి లాంటి ప్రముఖ గాయనీగాయకుల చేత కూడా పాడించి తన వ్యాఖ్యానంతో “భాగవత ఆణిముత్యాలు” పేరిట అద్భుతమైన ఆల్బమ్ తయారు చేశాడు.  ఇది మొదటి ఘట్టం.

ఏప్రిల్, 2014 లో మల్లిక్ ఇండియా వెళ్ళినప్పుడు పార్ధూ పరిచయం చేసిన కూచిభొట్ల రామ్ ప్రసాద్ (హైదరాబాద్) ఆ పద్యాలన్నింటినీ ఎంతో ఆకర్షణీయంగా www.bhagavatamanimutyalu.org అనే వెబ్ సైట్ లో పెట్టాడు.
ఇక మల్లిక్ ప్రధాన ఆశయం అయిన ప్రపంచ వ్యాప్తంగా అందరూ తమ ఫోన్లు, ఇతర పరికరాలలో ఉచితంగా, సునాయాసంగా డౌన్ లోడ్ చేసుకునే App ని తయారు చెయ్యడం కదా!  దానికి వూలపల్లి ఫణి కిరణ్ తన అసమానమైన సాంకేతిక నిపుణత సహాయంతో సునాయాసంగా అందరూ డౌన్ లోడ్ చేసుకునే లా ఒక APP తయారు చేసి ఆ ఘన విజయం సాధించాడు.
వీటన్నింటికీ మల్లిక్ రాత్రీ పగలూ అనక పడిన శ్రమ, స్వతస్సిధ్ధమైన మంచి వ్యక్తిత్వంతో అందరినీ కలుపుకుని పోవడం, నాసా లాంటి అత్యాధునిక అమెరికా కాంట్రాక్టర్ ల కంపెనీలలో ప్రొజెక్ట్ మేనేజ్ మెంట్ విభాగం లో పనిచేసిన సుదీర్ఘ అనుభవంతో అన్ని పనులూ ప్రణాళికాబద్ధంగా చెయ్యడం....ఇవన్నీ ఈ దైవకార్యానికి అవసరం అయిన దినుసులు.

ఇక జనవరి 15, 2016 న ఎల్. వీ. సుబ్రమణ్యం, IAS (అప్పటి Principal Secretary of A.P) గారి సలహా, సహకారాలతో తిరుపతి లో మహతి ఆడిటోరియంలో చాగంటి కోటేశ్వర రావు గారి చేతుల మీదుగా iBAM సంస్థ, భాగవత ఆణిముత్యాల APP, గ్రంథం, తాళపత్ర గ్రంథాల ఆవిష్కరణ వైభవోపేతంగా జరిగాయి.  వీటన్నింటికీ ఎంతో స్ఫూర్తి, సహకారం అందించిన మల్లిక్ సతీమణి వసంత లక్ష్మి సెప్టెంబర్, 2015 లో ఆకస్మికంగా పరమపదించడం దురదృష్టం, అతనికే కాదు..మా అందరికీ కూడా...

మీ కోసం:..అంటే...FB మిత్రులు చేయవలసిన పని:
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ క్రింది వెబ్ సైట్ లోనూ, డౌన్ లోడ్ చేసుకుని తమ మొబైల్ పరికరాలనూ ఈ క్రింది లంకెలలో భాగవత ఆణిముత్యాలు విని, చదివి తరించమని కోరుతున్నాను.

ఆనందించే విషయం ఏమిటంటే....మల్లిక్ పుచ్చా నాయకత్వం లో తయారు అయిన ఆ App డౌన్ లోడ్ చేసుకుని, శలాక రఘునాధ శర్మ గారి వ్యాఖ్యానంతో, నేమాని పార్ధ సారధి భక్తి పారవశ్యంతో ఆలపించిన "భాగవత ఆణిముత్యాలు" వింటూ తరిస్తున్న వారు ఇప్పటి దాకా లక్ష మంది పైగానే ఉన్నారు.  రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది.  మీరు సహకరిస్తే ఆ సంఖ్యని రెట్టింపు చెయ్యాలని మా కోరిక.

Download Links for Pothana Animutyalu

Google APP for mobile devices
https://play.google.com/store/apps/details?id=com.fani.iBAM

iPhone, iPad, and iPod touch download link:
https://apps.apple.com/us/app/ibam2.2/id1139431364

Web Site link
http://www.bhagavatamanimutyalu.org

సంస్థాగతంగా.....

మార్చ్ 9, 2013 నాడు మల్లిక్ పుచ్చా ప్రారంభించిన ఈ మహాయజ్ణం 2015 నాటికి గాడిని పడింది అని నిర్ధారణ అయ్యాక ఐ-భాగవత అణిముత్యాలు  {http://bhagavatamanimutyalu.org/IBamC1 .h t m l} అనే పేరిట ఒక లాభాపేక్ష లేని సంస్థని అతను అమెరికాలో రిజిస్టర్ చేశాడు.  అంతవరకూ ఈ బృహత్ కార్యక్రమం తాలూకు ఆర్ధిక వ్యవహారాలు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున నేను చూసేవాడిని.
మల్లిక్ అధ్యక్షుడిగా ఇక్కడ iBAM సంస్థ ప్రారంభించాక రమణి విష్ణుభొట్ల (ఆస్టిన్) ఉపాధ్యక్షురాలు గానూ, అరుణ్ కాంత్ (హ్యూస్టన్) కార్యదర్శి గానూ, వెంకట్ వారణాసి కోశాధికారి గానూ, నేను ఎప్పటిలాగానే ప్రధాన సలహాదారుడి గానూ నియమితులయ్యాం.

ఆ తర్వాత ఫిబ్రవరి 2016 లో అక్కడ ఇండియాలో నేమాని పార్ధు మేనెజింగ్ ట్రస్టీ గానూ, ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారూ, కూచిభొట్ల రామ్ ప్రసాద్ సభ్యులుగానూ iBAM ట్రస్ట్ కూడా అక్కడ ఇండియాలో ప్రారంభం అయింది.  ఈ సంస్థ ద్వారా 324 పోతన ఆణిముత్యాలని CD రూపం లోనూ, పుస్తకం రూపంలోనూ అందుబాటులోకి వచ్చాయి.  శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ స్వాముల వారు, శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి సమక్షం లో గత జులై 29, 2016 నాడు ఈ CD లు విడుదల చెయ్యబడ్డాయి.  ఆ తరువాత జులై 2, 2016 హ్యూస్టన్ లో భారత దౌత్యాధికారి చేత అమెరికాలోనూ, ఆగస్ట్ 12 న విజయవాడ లో కృష్ణా పుష్కరాలలోనూ. సెప్టెంబర్ 23, 2017 న నేపాల్ లోని గజేంద్ర ధామ్ లో జరిగిన ఆవిష్కరణ సభలు చాలా విశేషమైనవి.

ఇక ఈ వారం అసలు విశేషం..
   
గత శనివారం, సెప్టెంబర్ 14, 2019: 

మా హ్యూస్టన్ లో బాల బాలికలకి “పోతన పద్యాలు” పోటీ.

ప్రస్తుతం iBAM సంస్థ తరఫున అమెరికాలోనూ, ఇండియాలోనూ పోతనామాత్యుల వారి పద్యాలని విశ్వవ్యాప్తి చెయ్యడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాం.  వాటిలో ప్రధానమైనది అమెరికాలో బాలబాలికలకి “పోతన పద్యాలు” పోటీ.

ఆ పరంపరలో 5-18 వయసు పిల్లలకి మొన్న సెప్టెంబర్ 14, 2019 నాడు హ్యూస్టన్ లో జరిగిన రెండవ సారి పోటీ అఖండ విజయాన్ని సాధించింది.  డిశంబర్ 9, 2017 పోటీ లాగే ఇప్పుడు కూడా 40 మంది పైగా బాలబాలికలు సుమారు 200 మంది ఆహూతుల సమక్షం లో ఈ పోటీ లో పాల్గొన్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన యువ అవధాని లలిత్ గన్నవరపు ప్రత్యేక అతిథిగా విచ్చేసి తెలుగు పద్యాల ప్రాముఖ్యతని వివరించారు.

ఈ భాగవత పద్యాల పోటీ విజేతలు:

5 ఏళ్ళ లోపు:

ఆద్య నందిని శ్రీమాజేటి, శ్రీలలిత కొమరవోలు, సాత్విక్ కస్తూరి

5-8 సంవత్సరాలు: వైష్ణవి రెండుచింతల, వేద గాయత్రి వలివేటి, ప్రియాంక చిలుకూరి

9-11 సంవత్సరాలు: మేధ అనంతుని, శ్రావణి పోలూరి, శ్రీ సంహిత పొన్నపల్లి,

12-18 సంవత్సరాలు: శ్రీహర్ష పొట్ట, సిద్ధార్థ్ అయ్యగారి, సిద్ధార్థ్ పొట్ట 

గజేంద్ర ట్రోఫీ విజేతలు: శ్రావణి పోలూరి, మేధా అనంతుని, శ్రీసంహిత పొన్నపల్లి,

మల్లిక్ కి అండదండలు గా నిలిచిన వారు:

సమన్వయ కర్తలు: రమేష్ దేశభొట్ల, ఇందిర చెరువు;

వ్యాఖ్యాత: వనజ కొండూరి;

న్యాయ నిర్ణేతలు:

శాయి రాచకొండ, శ్రవణ్ అర్రా, బాల మురళీ కృష్ణ గోపరాజు, ఇందిర చెరువు, విజయ సారధి,  జీడిగుంట, మురళి లంకా, సత్యదేవ్ చిలుకూరి, నాగ అంబటిపూడి, ఉమ దేశభొట్ల,

సహాయకులు:

రమణి విష్ణుభొట్ల, కాంత్ & సునీత దువ్వూరి, వెంకట్ వారణాసి, రఘురామ్ ధూళిపాళ, సుమన్ మంగు, సీతారామ్ అయ్యగారి, హిమబిందు & రవికాంత్ పొన్నపల్లి, శివ కొండూరి, సుధేష్ పిల్లుట్ల,  మురళి & స్వర్ణ లంకా, శర్మ & జానకి పేరి, గాయత్రి సరిపల్లి, శ్రీవాణి అంబటిపూడి, అరుణ గుబ్బా, దీప్తి శ్రీరాంభట్ల, కుషాల్ అంబటిపూడి (ఫొటో, విడియో) తదితరులు.

తెర వెనుక “భాగోతం” అంతా భవదీయుడు వంగూరి చిట్టెన్ రాజు

ఆ పోటీ తాలూకు కొన్ని ఫొటోలు, TV 5 వారి ప్రసారం విడియోలు ఇక్కడ జతపరిచాను.

https://youtu.be/39l85o9xzB8

మల్లిక్ సారధ్యం లో లాభాపేక్ష లేని iBAM సంస్థ పోతన గారి సారస్వతానికి ప్రపంచ వ్యాప్తంగా మరింత పురోగతి సాధించడానికి కొనసాగిస్తున్న ఇతర ఆసక్తికరమైన వివరాలు..మరొకసారి... 

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు"